సివిల్స్ అందరికీ సాధ్యమే - అపోహలు వీడి సాధన మొదలుపెట్టండి - నారాయణ సలహాలు

 ఏటా యూపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే పట్టుదలతో, ప్రణాళికతో దీర్ఘకాలం ప్రిపరేషన్ సాగించాలి. చాలా ఓపిక అవసరం. సివిల్స్ లో వెయ్యి లోపు ఉద్యోగ ఖాళీలు ఉంటే దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటారు. అటువంటి  సివిల్స్ పరీక్షకు సిద్ధం కావాలంటే, చాలా ముందుచూపు మరియు ప్రణాళిక ఉండాలి. చాలా మంది అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించాలని కోరుకుంటారు.. నేను టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలా? నేను రోజుకు 18 గంటలు చదువుకోవాలా? నేను కోచింగ్ తీసుకుంటే నేను విజయం సాధించగలనా? ఇలా అనేక సందేహాలు వారికి ఉంటాయి. అటువంటి వారి కోసం సివిల్స్ పరీక్షపై అపోహల గురించి తెలుసుకుందాం, వాస్తవాలను కూడా చూద్దాం.


అపోహ: సివిల్స్‌కు ప్రిపేర్ కావాలంటే, మీరు ప్రతిరోజూ 15-18 గంటలు చదవాలి?

వాస్తవం: ఏడాది పొడవునా రోజుకు 15–18 గంటలు చదువు కొనసాగించడం అందరికీ సాధ్యం కాదు. ఎన్ని గంటలు చదివామో దానికంటే ఎంత బాగా గ్రహిస్తాం అన్నదే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా ఉంటే.. చదువుపై ఏకాగ్రత బాగుంటుంది. కాబట్టి గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోవడం కంటే ఏకాగ్రతతో చదవడం ముఖ్యమని గుర్తించాలి.


అపోహ: ఉన్నత విద్యావంతులు మాత్రమే సివిల్స్ పరీక్షలో విజయం సాధిస్తారా?

వాస్తవం: సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత సరిపోతుంది. ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్యావంతులు మాత్రమే విజయం సాధిస్తారనేది వాస్తవం కాదు. సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన చాలా మంది అభ్యర్థులు ప్రతి సంవత్సరం సివిల్స్‌లో విజయం సాధిస్తున్నారు. కృషి, తపన, పట్టుదల, ఓర్పు ఉంటే ఎవరైనా సివిల్స్ సాధించవచ్చు.


అపోహ: ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించగలరా?

వాస్తవం: వివిధ నేపథ్యాల అభ్యర్థులను దరఖాస్తు చేసుకోమని యూపీఎస్సీ ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషలలో, ఏ భాషలోనైనా పరీక్ష రాయడానికి,  ఇంటర్వ్యూలో సమాధానాలు ఇవ్వడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో సరళంగా, సూటిగా తమ అభిప్రాయాలను రాయడం, వ్యక్తం చేయడం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అయితే ప్రామాణిక పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లీషులోనే లభిస్తాయి. కాబట్టి ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకుంటే పరీక్షల ప్రిపరేషన్‌లో కచ్చితంగా సహాయపడుతుంది.

- పి. నారాయణ

పోటీ పరీక్షల శిక్షకులు

Comments

Popular posts from this blog

పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మెలకువలు... నారాయణపేట కలెక్టర్ హరిచందన సూచనలు

TSPSC Accounts Officers and Junior Accountants Recruitment Notification 2023