భారతదేశంలో ఉద్యోగాలపై కరోనా ప్రభావం

అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. అయితే ఇది ఆరోగ్యపరమైన పోలిక మాత్రమే. ఉద్యోగాలపై కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తే భారతదేశం ఇతర దేశాలకంటే తీవ్రంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగాల్లో కంపెనీలు తీవ్రంగా కోతలు విధిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడని రీతిలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఉద్యోగాలు నష్టపోయేవారి సంఖ్య రష్యా జనాభా కంటే ఎక్కువగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ప్రారంభ అంచనాలు మాత్రమే. కరోనా ప్రభావం, తీవ్రతను బట్టి పరిస్థితి ఇంకా దిగజారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సీఎంఐఈ అంచనా ప్రకారం...

భారతదేశంలో ఉద్యోగాల సర్వేకు సంబంధించి అధీకృత సంస్థ సెంటర్‌ ఫర్‌ ది మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ. ఈ సంస్థ రోజూ 3,500 మందిని సర్వే చేస్తుంది. రోజువారీ, నెలవారీ, సంవత్సరం వారీ నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. ప్రస్తుతం దాదాపు వెయ్యి మందిని టెలిఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూలు చేసి ఫలితాలను విశ్లేషించింది. దీని అంచనా ప్రకారం లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలివారంలోనే 23.4 శాతం నిరుద్యోగిత నమోదైంది. 20 శాతం కంటే ఎక్కువ నిరుద్యోగిత రేటు ఉండటం ఏ దేశానికైనా మంచి పరిణామం కాదు. పనిచేసే వయసువారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే ఈ నిరుద్యోగిత రేటు 27.7 శాతం ఉంది.

యువ జనాభాపై ప్రభావం:

భారతదేశంలో యువ జనాభా అధికంగా ఉంది. మొత్తం 137 కోట్ల జనాభాలో 103 కోట్లు మంది 15 ఏళ్లుపైబడినవారు ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు లెక్కలను చూస్తే దాదాపు 40 శాతం మంది ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నారు. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే నిరుద్యోగులుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. పని చేసే వయసున్నవారిలో 27.7 శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే రెండు మూడు వారాల్లోని ఉద్యోగాల పరిస్థితి తలకిందులైంది. దాదాపు 12 శాతం నిరుద్యోగం పెరిగింది. ఇది పూర్తిగా కరోనా వైరస్‌ తదనంతర పరిణామమే.

12 కోట్ల ఉద్యోగాలు ఉఫ్‌

అంటే మొత్తం పనిచేసే వయసున్న 103 కోట్ల మంది జనాభాలో 12 శాతం మందికి ఉద్యోగాలు పోయాయంటే దాదాపు 12 కోట్ల మంది కొత్తగా నిరుద్యోగుల జాబితాలోకి చేరారు. వీరిలో 8 కోట్ల మంది కేవలం తమ ఒక్కరి ఆదాయం ద్వారానే కుటుంబాలను పోసిస్తున్నవారు ఉన్నారు. దీన్ని బట్టి మొత్తంగా చూసుకుంటే 25 కోట్ల కుటుంబాలు కరోనా వైరస్‌ వల్ల రోడ్డున పడినట్టు అర్థమవుతుంది. ఇది తీవ్ర ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు, కంపెనీలు ముందుకొచ్చి యువతకు మార్గం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.

Comments

Popular posts from this blog

Karnataka Bank Probationary Officers (PO) Recruitment Notification 2024

NLC India Limited recruitment of 167 Executive Trainee positions 2024

TSPSC Group 2 Hall Tickets Download